
Hyderabad Collector Speaks on Safety of School Children
ట్రాఫిక్ రూల్స్ పై పిల్లలకు అవగాహన కల్పించాలి పాఠశాలల నిర్వహకులు పిల్లల పట్ల బాధ్యత, శ్రద్ధ చూపాలి డ్రైవర్లకు రోడ్డు నిబంధనలు తెలిసి ఉండాలి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యజమాన్యం పిల్లల పట్ల ప్రత్యేక బాధ్యత, శ్రద్ధ చూపాలని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సి.వి ఆనంద్ అన్నారు. గురువారం రవీంద్రభారతిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం అలాగే […]
పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యజమాన్యం పిల్లల పట్ల ప్రత్యేక బాధ్యత, శ్రద్ధ చూపాలని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సి.వి ఆనంద్ అన్నారు.
గురువారం రవీంద్రభారతిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం అలాగే ఇతర శాఖలు నిర్వహించే బాధ్యతపై ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తో పాటు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయెల్ డేవీస్, కంటోన్మెంట్ బోర్డ్,సీఈఓ మధుకర్ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ మాట్లాడుతూ పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలని ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ హైదరాబాద్ జిల్లాలో పటిష్ట చర్యలు చేపట్టటం జరిగిందని అన్నారు. పాఠశాల యాజమాన్యులు గడుతీరిన వాహనాలను నడిపితే అట్టి వాహనాలు సీజ్ చేయటంతో పాటు పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని సూచించారు. పాఠశాల యాజమాన్యాలు పాఠశాలల లోపల,ఆవరణ బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పాఠశాల సమయంలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అదేవిధంగా వాహనాలు నడిపే డ్రైవర్లు వాహనాల సేఫ్టీతో పాటు రోడ్డు నిబంధనలు పాటిస్తూ పిల్లలను క్షేమంగా చేర్చే విధంగా నిబద్ధతతో వాహనాలు నడపాలని ప్రతి వాహనంలో కూడా ఒక అటెండెంట్ ఉండే విధంగా చూడాలని అలాగే ప్రతి పాఠశాలలో కూడా సెక్యూరిటీ గార్డ్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. పాఠశాలలకు వెళ్లే ప్రాంతాల్లో ప్రమాద స్థలాలు, స్పీడ్ బ్రేకర్స్, వాహనాల స్పీడ్, తగ్గించి తీసుకువెళ్లటం శ్రేయస్కరమని సూచించారు. హైదరాబాద్ లో ఫిట్నెస్ లేని వాహనాలను ఇప్పటికే సీజ్ చేయడం జరిగిందని, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను దాదాపుగా 40 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల సేఫ్టీ, వాహనాల సేఫ్టీ, బస్సు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం నిరంతరం ప్రత్యేక కృషి చేస్తుందని ఆయన తెలిపారు. బస్సులపై పాఠశాల, కళాశాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లు తప్పక ఉండాలని అలాగే ప్రతి బస్సు పై కూడా అత్యవసర ద్వారం(ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్) అని తప్పక వ్రాయించాలని సూచించారు. ముఖ్యంగా మత్తు పదార్థాలు సేవించే వారిపై ఉక్కు పాదంతో అణిచివేస్తామని, పాఠశాల కళాశాలలకు వెళ్లే పిల్లలకు మత్తు పదార్థాలు అందించే వారిపై కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ నిబంధనల మేరకు వాహనదారులు నడుచుకోవాలని సూచించారు. ట్రాన్స్పోర్ట్, విద్యాశాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాఠశాలల పిల్లలు ప్రమాదాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో అన్ని భద్రత లేని బస్సులపై నిఘా ఉంచాలని, పిల్లలపై శ్రద్ధ చూపవలసిన బాధ్యత మనందరిపై ఉందని దీన్ని ఒక సామాజిక బాధ్యతగా మనమందరం స్వీకరించాలని నేటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు పునాదులని పాఠశాల నిర్వహకులు ఫిట్నెస్ ఉన్న వాహనాలను మాత్రమే నడపాలని డ్రైవర్లకు రోడ్డు నిబంధనలు తప్పక తెలిసి ఉండాలని ప్రతి బస్సులో కూడా అటెండెంట్ తో పాటు పాఠశాలలో కూడా సెక్యూరిటీ గార్డులు ఉండాలని ఆమె సూచించారు. జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం సంతోషదాయకమని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9,10 తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తదుపరి ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ అధికారులు, పాఠశాల యాజమాన్యులు ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్, స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, ఈడి ఆర్టిసి రాజశేఖర్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, డీఈవో రోహిణి, స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.