హైదరాబాద్/మక్తల్: భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఏకంగా ఓ మండలం అంతా పూర్తి స్థాయిలో ఆన్లైన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) యొక్క డిజిథాన్ కృషితో ఈ మేరకు నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలంలో సమగ్ర టెలీమెడిసిన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. `టి. కన్సల్ట్` పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టును శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో కరోనా వ్యాప్తి గురించి చిన్న జీయర్ స్వామి తెలుసుకోగా... తమ జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదని కలెక్టర్ వివరించారు. హోమియోకు సంబంధించి జీయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) బృందాన్ని ఆన్లైన్ సేవల్లో అందుబాటులోకి తెస్తామని జీయర్ స్వామి హామీ ఇచ్చారు. కాగా, ఈ ఆన్లైన్ భాగంగా మండలంలోని 39 గ్రామ పంచాయతీలు ఆన్లైన్ ద్వారా వైద్య సేవలు పొందనున్నాయి. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన స్వయంగా ఆహ్వానించిన నేపథ్యంలో టీటా ఈ మేరకు నోడల్ ఆఫీసర్లకు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసింది.
నారాయణపేట జిల్లాలో ఇప్పటికే టీటా వివిధ కార్యక్రమాలను చేపట్టింది. జిల్లాలోని ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించడంలో భాగంగా తమ జిల్లాలో టెలీమెడిసిన్ సేవలు ప్రవేశపెట్టాలని కలెక్టర్ హరిచందన టీటా గ్లోబల్ ప్రెసిడెంట్స్ సందీప్ కుమార్ మక్తాలను కోరారు. దీంతో భారతదేశంలోనే పూర్తిస్థాయిలో మొట్టమొదటిసారిగా ఒక మండలాన్ని టెలీమెడిసిన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాకు చెందిన క్లినికల్స్ సంస్థ టెక్నాలజీ సహాయం అందిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, పంచాయతీ కార్యాలయం నోడల్ ఆఫీసుగా ఉండనుండగా పంచాయతీ సెక్రటరీ నోడల్ ఆఫీసర్‌గా ఉండనున్నారు.
మండలం మొత్తానికి టెలీమెడిసిన్ సేవలు అందించడంలో భాగంగా ఆన్లైన్ విధానం ద్వారా సంబంధిత స్పెషలైజ్డ్ డాక్టర్ తమ అందుబాటు సమయం పేర్కొంటారు. దానికి అనుగుణంగా ప్రజలు అపాయింట్మెంట్ పొందుతారు. అనంతరం సంబందిత డాక్టర్ మరియు గ్రామస్తుడు ఆన్లైన్ ద్వారా కన్సల్ట్ అవుతారు. వీరిద్దరి మధ్య జరిగిన టెలీ మెడిసిన్ ప్రక్రియ అనంతరం ప్రిస్క్రిప్షన్ సైతం ఆన్లైన్ ద్వారా సంబంధిత గ్రామస్తులకు చేరుతుంది. నోడల్ ఆఫీసు అయిన పంచాయతీ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ అయిన పంచాయతీ సెక్రటరీ ఈ వీడియో కనెక్ట్ ప్రక్రియకు సమన్వయం చేస్తారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తులు బయటకు రావద్దనే ఆదేశాలు ఉండటంతో వాటిని గౌరవించడంతో పాటుగా మెరుగైన వైద్యసేవలు సామాన్యులకు సైతం ఈ ప్రాజెక్టు ద్వారా చేరువ కానున్నాయి. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా టీటా వాలంటీర్లు మొదటి దశ ట్రైనింగ్‌ను నోడల్ ఆఫీసర్ అయిన 39 మంది పంచాయతీ సెక్రటరీలకు అందించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లిఖార్జున్, మండల్ పంచాయతీ ఆఫీసర్ పావని కుమార్ తదితరులు ఈ శిక్షణలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ `టి. కన్సల్ట్` సేవలను ప్రవేశపెట్టి టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల కృషిని ప్రశంసించారు. తమ జిమ్స్లోని బృందాన్ని సైతం ఈ సేవల్లో భాగం చేస్తామని జీయర్ స్వామి తెలిపారు. టెకీల కోసమే కాకుండా సామాన్య ప్రజల కోసం కూడా టీటా ఆలోచించడం అభినందనీయమని జీయర్ స్వామి కొనియాడారు. `టి. కన్సల్ట్` ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల పరంగా సమగ్ర మార్పులు రానున్నాయని చిన్న జీయర్ స్వామి ధీమా వ్యక్తం చేశారు. హోమియోపతిని సైతం ఈ సేవల్లో భాగం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ఇటీవల తమ జిల్లాకు చెందిన ఏడునెలల గర్భిణి మహిళ గైనకాలజిస్ట్ సహాయం లేకపోవడం వల్ల కన్నుమూయడం తనను కలచివేసిందన్నారు. వైద్యసేలు ఆన్లైన్లో అందుబాటులో ఉండటం వల్ల ఈ సమస్యలు తప్పుతాయని భావించి టెలీమెడిసిన్ విషయంలో టీటాతో సంప్రదింపులు జరిపినట్లు తెలియజేశారు. మక్తల్ మండలంలో ప్రాజెక్టు ఫలితాలు అధ్యయనం చేసి అనంతరం జిల్లాలోని మిగతా 10 మండలాలలకు విస్తరించడం లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. మక్తల్ ప్రజలు ఈ సేవలు అందుకునేందుకు సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీలను సంప్రదించాలని కోరారు.
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ, `టి-కన్సల్ట్` ప్రాజెక్టును జిల్లా ప్రజల కోసం అందుబాటులోకి తెస్తున్న కలెక్టర్ గారు స్వయంగా కొందరు వైద్యులను ఈ సేవల్లో భాగస్వామ్యం చేయడం అభినందనీయమని తెలిపారు. ఇటీవలే ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తదితర కరోనా తీవ్ర ప్రభావిత దేశాల్లోని ఎన్నారైలకు కోవిడ్-19 విషయంలో `డిజిథాన్ ఆన్లైన్ క్లినిక్` ద్వారా వైద్య సేవలు అందించిన ప్రక్రియకు కొనసాగింపుగా పల్లె సీమల్లోని ప్రజలకు ఈ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తెస్తున్నట్లు సందీప్ వివరించారు. గ్రామస్తులు వైద్య సమస్యలు ఎదుర్కుంటున్నారని వారికి ఆ ఇబ్బందులు తొలగించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాలకు ఈ ప్రాజెక్టును విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు టెక్నాలజీ సహకారం అందించిన క్లినికల్స్ సంస్థ యజమాని రాజ్, కెన్నత్, టీటా సలహాదారు సాయిబాబా తల్లూరి, టీటా ప్రతినిధులు రాణాప్రతాప్ బొజ్జం, సౌమ్య, శంకర్ మరియు నోడల్ ఆఫీసర్లకు ఆన్లైన్ ద్వారా శిక్షణ అందించిన టీటా వాలంటీర్లకు సందీప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.